V5 NEWS
Gusa Gusa 27/10/2026

యలహంక ప్యాలెస్ ఎవరిది? జగన్ నివాసమా, షర్మిల వాటానా? పెళ్లి వేళ రచ్చకెక్కిన అన్నాచెల్లెళ్ల వివాదం

యలహంక ప్యాలెస్ ఎవరిది? జగన్ vs షర్మిల

27 October 2026 • Venkatesh Kadakanchi • 4 Min Read • 10 Views
Published: 27 October 2026, 01:23 PM Last Updated: 27 October 2026, 02:05 PM
యలహంక ప్యాలెస్ ఎవరిది? జగన్ నివాసమా, షర్మిల వాటానా? పెళ్లి వేళ రచ్చకెక్కిన అన్నాచెల్లెళ్ల వివాదం
యలహంక ప్యాలెస్ వివాదంపై జగన్, షర్మిల మధ్య విభేదాలు Credit: V5 News

యలహంక ప్యాలెస్‌ ఎవరిది? 
అది జగన్ దా లేక షర్మిలదా..? 

షర్మిల కుమార్తె పెళ్లి వేళ.. చర్చంతా బెంగళూరు ప్యాలెస్ వైపు మళ్లడం వెనుక అసలేం జరిగింది..? అంత డబ్బులున్న ఫ్యామిలీలో కూడా బంధాల కంటే.. ఆస్తులకే ఎక్కువ విలువిస్తారా అని జనం మాట్లాడుకుంటున్నారు. 
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో అసలేం జరుగుతోంది..? 
ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేసిన చెల్లెలు. అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన నాయకురాలు. కానీ ఇప్పుడు అదే అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ రచ్చకెక్కింది. కూతురి పెళ్లి వేదిక దగ్గర మొదలైన వివాదం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో పెళ్లి జరపాలని షర్మిల భావిస్తుంటే.. అక్కడ పెళ్లి నిర్వహించడానికి జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాలు చెబుతూ చెల్లెలికి లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించడంతో.. కుటుంబ వివాదం కాస్త రాజకీయ యుద్ధంగా మారింది. అసలు ఈ ప్యాలెస్‌ ఎవరిది? జగన్‌ ఎందుకు అడ్డుచెప్పారు? షర్మిల కుటుంబం ఇప్పుడు ఏం చేయబోతోంది? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి?

ముందుగా జగన్‌ రాసిన లేఖలోకి వెళ్దాం. అక్టోబర్‌ 9 తేదీతో ఉన్న ఈ లేఖను వైఎస్సార్‌సీపీ అక్టోబర్‌ 24న బహిరంగంగా విడుదల చేసింది. అందులో జగన్‌ చెప్పిన కారణం ఒక్కటే. భద్రత, వ్యక్తిగత గోప్యత. షర్మిల కుమార్తె అంజలి రెడ్డి పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులు వస్తారని, క్యాటరింగ్‌ సిబ్బంది, ఈవెంట్‌ మేనేజర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ప్యాలెస్‌లోకి వస్తూ పోతూ ఉంటారని జగన్‌ వివరించారు. వీళ్లలో చాలామంది కుటుంబానికి తెలియని వ్యక్తులేనని, ప్యాలెస్‌, పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుమార్తెల పెళ్లి అయినా ఇదే నిర్ణయం తీసుకునేవాడినని లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు, పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని షర్మిలకు సూచించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసాన్ని ఉపయోగించుకోవచ్చని కూడా ప్రతిపాదించారు. తన అభ్యంతరాలను ముందుగానే కుటుంబ సభ్యుల ద్వారా తెలియజేసినా, వాటిని పట్టించుకోకుండా ఏర్పాట్లు కొనసాగించడం బాధ కలిగించిందని జగన్‌ లేఖలో రాశారు.

మరి షర్మిల వెనక్కి తగ్గడం లేదా? ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నవంబర్‌ 25న జరగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి ఆహ్వాన పత్రికలు పంపినట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్‌ 26న కూడా యలహంక ప్యాలెస్‌ చిరునామాతోనే ఆహ్వానాలు పంపినట్లు వార్తలొచ్చాయి. 

అంటే జగన్‌ అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోలేదు. ఒకవైపు భద్రతా కారణాలతో జగన్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. మరోవైపు షర్మిల కుటుంబం పెళ్లి ఏర్పాట్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు స్పష్టమైన సమాచారం లేదు.

ఈ ఎపిసోడ్ లోకి చంద్రబాబు ఎంట్రీతో రాజకీయ రచ్చ మరింత వేడెక్కింది. 

చంద్రబాబు.. జగన్‌ తీరుపై విమర్శలు చేస్తూ, ఆయన్ని కంసమామతో పోల్చారు. సొంత తల్లి, చెల్లెలి విషయంలోనే న్యాయం చేయడం లేదని ఆరోపించారు. కుటుంబ విలువలు, ఆస్తుల పంపకం అంశాలను ప్రస్తావిస్తూ జగన్‌పై రాజకీయంగా విమర్శలు గుప్పించారు.

ఇక్కడితో వివాదం కుటుంబానికే పరిమితం కాలేదు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ కూడా తీవ్రంగా స్పందించింది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరుగుతున్న అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఈ కుటుంబ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఎదురుదాడి చేసింది.

సరే.. కాసేపు ఈ రాజకీయ విమర్శలను పక్కనపెడదాం..

అసలు ఈ ప్యాలెస్‌ ఎవరిది?

ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న ఇదే. యలహంక ప్యాలెస్‌ ఎవరిది? జగన్‌ నివాసం కాబట్టి ఆయన నిర్ణయమే ఫైనలా? లేక కుటుంబ ఆస్తుల్లో తనకూ వాటా ఉందని షర్మిల భావిస్తున్నారా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదాన్ని చూడాలి. జగన్‌, షర్మిల మధ్య విభేదాలు నిన్న మొన్న మొదలైనవి కావు. కుటుంబ ఆస్తుల పంపకం, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో వాటాల వ్యవహారం వంటి అంశాలపై చాలాకాలంగా గొడవ జరుగుతోంది. సరస్వతి పవర్‌ వాటాల వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ పరిధిలోనూ చర్చకు వచ్చింది. 

ఈ వ్యవహారంతో అన్నా చెల్లెళ్ల ముధ్య దూరం మరింత పెరిగిందా అనే చర్చ మొదలైంది. 

ఒకప్పుడు జగన్‌ కోసం షర్మిల పాదయాత్ర చేశారు. జగన్‌ జైలులో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ తరఫున ప్రచారం చేశారు. కానీ, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ, రాజకీయ విభేదాలు పెరిగాయి. ఇందుకు కారణాలు.. ఆస్తులే అని చెప్పేవాళ్లూ ఉన్నారు. 

ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాజకీయంగా కూడా జగన్‌కు ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. అంటే ఈ ప్యాలెస్‌ వివాదం ఒక పెళ్లి వేదిక దగ్గర మొదలైన గొడవ మాత్రమే కాదు. కుటుంబ సంబంధాలు, ఆస్తుల హక్కులు, రాజకీయ ఆధిపత్యం.. ఇలా అనేక అంశాలు ఇందులో కలిసిపోయాయి.

మరి నవంబర్‌ 25న ఏం జరగబోతోంది?

ఇప్పుడు అసలు ఉత్కంఠ పెళ్లి తేదీ చుట్టూనే ఉంది. నవంబర్‌ 25న అంజలి రెడ్డి వివాహం జరగాల్సి ఉంది. యలహంక ప్యాలెస్‌లోనే పెళ్లి జరుగుతుందా? వేరే వేదికను ఎంచుకుంటారా? జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? ఇప్పటికైతే వీటికి స్పష్టమైన సమాధానాలు లేవు.  మొత్తానికి రాజకీయంగా ప్రత్యర్థులుగా మారిన అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఇప్పుడు కుటుంబంలోని మరో తరానికి సంబంధించిన పెళ్లి వేడుకపైనా ప్రభావం చూపుతున్నాయి. అంతేకాదు.. యలహంక ప్యాలెస్‌ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

 

మరి ఈ ప్యాలెస్‌ పంచాయితీకి ముగింపు ఎప్పుడు? పెళ్లి వేదిక మారుతుందా, లేక వివాదం మధ్యే వివాహం జరుగుతుందా? నవంబర్‌ 25 వరకు ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

 

Share: WhatsApp Facebook Twitter
V
By Venkatesh Kadakanchi
Andhra Pradesh

Post a Comment

Your email will not be shown publicly.

Your comment will be published after review and approval by the administrator.