కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఎవరి టైమ్ నడుస్తోంది..? ఒకవైపు అన్న వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు.. మరోవైపు తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కూడా ఇప్పుడు మంత్రి పదవిపై గట్టిగానే ఫోకస్ పెట్టారా..? తెలంగాణ రాజకీయాల్లో దీనిపైనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం.. సీఎంకు బహిరంగంగా సన్మానం చేయడం.. తనకు మంత్రి పదవి ఇస్తారన్న పాత హామీలను గుర్తు చేయడం.. ఇప్పుడు సీఎం ఢిల్లీ టూర్‌కు వెళ్లడం.. ఇవన్నీ కలిపి తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.
మరి రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ వస్తే.. అన్న వెంకట్‌రెడ్డి పరిస్థితేంటి? ఇద్దరు అన్నదమ్ములు ఒకే కేబినెట్‌లో ఉంటారా? లేక ఒకరికి అవకాశం ఇస్తే మరొకరి రాజకీయ ప్రాధాన్యతపై ప్రభావం పడుతుందా? అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య జరుగుతున్నదేంటి?
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి.. తన నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని చెబుతున్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినందుకే రేవంత్‌రెడ్డిని సన్మానించానని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను మంత్రి పదవి కోసం పైరవీ చేశానన్న ప్రచారాన్ని మాత్రం రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. కానీ రాజకీయాల్లో అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. రాజగోపాల్ రెడ్డి వేస్తున్న ఎత్తులు మంత్రి పదవి కోసమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్‌రెడ్డి పేరు కొత్తది కాదు. గతంలో కూడా ఆయన పేరు కేబినెట్ విస్తరణలో ప్రముఖంగా వినిపించింది.
ఇక రాజగోపాల్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మునుగోడు నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉంటే.. రేవంత్ తొలి కేబినెట్‌లోనే మంత్రి అయ్యేవాడిని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యల అర్థమేంటా అని రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సెప్టెంబర్ ప్రారంభం నుంచే తెలంగాణ కేబినెట్‌లో మార్పులపై చర్చ జరుగుతోంది. కేబినెట్‌లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొందరి శాఖల్లో మార్పులు, మరికొందరి భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. రాజగోపాల్‌రెడ్డి పేరు కూడా ఆశావహుల జాబితాలో వినిపించింది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. రాజగోపాల్‌రెడ్డికి పదవి వస్తుందా లేదా అనేది మాత్రమే కాదు. వస్తే.. ఆ పదవి కోమటిరెడ్డి కుటుంబ రాజకీయ సమీకరణాలను ఎలా మార్చబోతోంది? దీనిపైనే తెలంగాణలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే రేవంత్ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌రెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో అది ప్రత్యేకమైన రాజకీయ సమీకరణంగా మారుతుంది. ఇక్కడే బ్రదర్స్ కోల్డ్‌వార్ అనే చర్చ తెరపైకి వస్తోంది. సెప్టెంబర్ 6న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి గైర్హాజరు కావడం.. అదే కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి సీఎంతో కలిసి కనిపించడం.. ఆయన భారీగా అనుచరులను తీసుకురావడం.. ఇవన్నీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే అది ఆయన అన్న వెంకట్‌రెడ్డితో రాజకీయంగా ఢీకొనే పరిస్థితికి దారితీయొచ్చనే గుసగుసలు సైతం వినిపించాయి.
ఇప్పుడు మరో కీలకమైన పాయింట్.. రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీలతో పాటు కాంగ్రెస్ నిర్వహిస్తున్న కీలక సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ మార్పులపై చర్చలు కొనసాగుతున్నాయి. అందుకే రేవంత్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ఆశావహుల్లో ఆసక్తి పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి పేరు ఇప్పటికే ఆశావహుల జాబితాలో ఉంది.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన పొలిటికల్ పజిల్ ఇదే.. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. అన్న వెంకట్‌రెడ్డి రాజకీయంగా ఎలా స్పందిస్తారు? అదే సమయంలో.. వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండగా.. అదే కుటుంబం నుంచి మరో వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎంతవరకు అవసరం? ఇది కేవలం ఇద్దరు అన్నదమ్ముల విషయం కాదు. మునుగోడు నుంచి నల్లగొండ వరకు.. కోమటిరెడ్డి కుటుంబం రాజకీయ బలాన్ని కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకోవాలనుకుంటోంది అన్నదే అసలు ప్రశ్న.
ఇప్పటివరకు కనిపిస్తున్న సంకేతాలు మాత్రం ఒక్కటే చెబుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపై ఆసక్తి ఉంది. ఆయన పేరు పరిశీలనలో ఉంది. కేబినెట్‌పై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఫైనల్ బెర్త్‌పై అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో అందరి చూపు ఢిల్లీ వైపే.. రాజగోపాల్‌రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? వస్తే వెంకట్‌రెడ్డి రాజకీయ లెక్కలు ఎలా మారతాయి? లేక.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఒకే ప్రభుత్వంలో తమ తమ రాజకీయ స్పేస్‌ను కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయంలోనే ఉంది.