మన దేశంలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరైనా ఉన్నారా?
మనకు కనిపించేది రోడ్ల మీద నిరసనలు, సోషల్ మీడియాలో పోస్టులు, రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలు.
కానీ వీటి వెనుక విదేశాల నుంచి నిధులు వస్తున్నాయా?
వస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడికి వెళ్తోంది? అసలు దాని వెనుక ఉన్న గేమ్ ఏంటి?
ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఈ చర్చ మధ్యలో వినిపిస్తున్న పేరు నెవిల్ రాయ్ సింఘమ్.
అసలు ఎవరీ వ్యక్తి?
భారత్‌తో ఆయనకున్న సంబంధం ఏంటి?
దీని వెనుక చైనా పేరు ఎందుకు వినిపిస్తోంది?
దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు మొదలైన నాటి నుంచి బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లిస్తూ వస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఆ కౌంటర్లకు కాస్త మసాలా కూడా యాడ్ చేస్తున్నారు. కాక్రోచ్ ల వెనుక ఎవరో ఉన్నారంటూ.. ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని విదేశీ శక్తులే వాళ్లను నడిపిస్తున్నాయని, డబ్బులు అక్కడి నుంచే వస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇలాంటి మాటలు ఎవరో చోటా మోటా నాయకుడంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఎవరైనా నేషనల్ లీడర్ అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఇది మన జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. మరి ఇప్పుడు ఏ నాయకుడు ఆరోపణలు చేశారు..? ఎందుకింత చర్చ మొదలైంది..? నిన్న మొన్నటి దాకా ఎవరో ఉన్నారని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తి పేరును బయటపెట్టడం వెనుక ఎలాంటి వ్యూహమేమై ఉండవచ్చు..? ఇవన్నీ సమాధానం వెతుకుతున్న ప్రశ్నలే.
కాంగ్రెస్, రాహుల్ గాంధీ, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంశాలను కలుపుతూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలేంటి? ఇవి నిజంగానే పొలిటికల్ ఆరోపణలా..? లేక తెరవెనుక ఏమైనా జరుగుతోందా..? ఈ సింఘం గొడవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం...
ముందుగా నెవిల్ రాయ్ సింఘమ్ ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే ఈ కథలో కొంత క్లారిటీ వస్తుంది.
ఈయన ఏదో సాధారణ వ్యక్తి కాదు. అమెరికా టెక్నోక్రాట్. థాట్‌వర్క్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించి, దాదాపు పాతికేళ్లపాటు దాన్ని నడిపించారు. 2017లో ఆ కంపెనీని అమ్మేసిన తర్వాత సామాజిక, రాజకీయ భావజాల సంస్థలకు నిధులు అందించే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన చైనాలోని షాంఘైలో సెటిలయ్యారు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.
ఒక బిజినెస్ మ్యాన్ తన సంపాదనను సామాజిక సంస్థలకు ఇవ్వడం తప్పు కాదు. తనకు నచ్చిన రాజకీయ భావజాలాన్ని సమర్థించడం కూడా తప్పు కాదు. కానీ ఆ నిధులు ఏ సంస్థలకు వెళ్తున్నాయి? ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? వాటి కార్యకలాపాలపై విదేశీ ప్రభుత్వాల ప్రభావం ఉందా? ఉంటే దానికి ఆధారాలేంటి? ఇవే అసలు సిసలైన ప్రశ్నలు.
సింఘమ్ పేరు భారత్‌లో పెద్ద వివాదంగా మారడానికి ప్రధాన కారణం న్యూస్‌క్లిక్ కేసు.
2023లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఇన్వెస్టిగేషన్ స్టోరీ సింఘమ్‌కు సంబంధం ఉన్న నిధుల వ్యవస్థలు, చైనా ప్రభుత్వ ప్రచార కథనాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలను తెరపైకి తెచ్చింది. న్యూస్‌క్లిక్ అనే డిజిటల్ న్యూస్ సంస్థకు కూడా సింఘమ్ నెట్‌వర్క్ ద్వారా నిధులు అందాయన్నది దాని జడ్జ్ మెంట్.
దీంతో భారత ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి. న్యూస్‌క్లిక్‌కు విదేశాల నుంచి వచ్చిన నిధులు, వాటి వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తాయి. చైనా అనుకూల ప్రచారం కోసం ఈ డబ్బును ఉపయోగించారనేది దర్యాప్తులో వచ్చిన ప్రధాన ఆరోపణల్లో ఒకటి.
న్యూస్‌క్లిక్ సంస్థ, సింఘమ్ ఈ ఆరోపణలను వ్యతిరేకించారు. చైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటున్నామన్న వాదనను సింఘమ్ ఖండించారు. అంతేకాదు, న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును 2024 మేలో సుప్రీంకోర్టు చెల్లదని ప్రకటించింది.
ఇంకో కీలకమైన విషయం. 2026 జూన్‌లో ఢిల్లీ హైకోర్టు, న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన 2020 నాటి ఆర్థిక నేరాల కేసుల్లో దర్యాప్తు చర్యలను కొట్టివేసింది. అంటే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఖండించినవాళ్లూ ఉన్నారు. కోర్టుల్లో కీలక పరిణామాలూ జరిగాయి.
మరి ఇప్పుడు ఈ పేరు మళ్లీ ఎందుకు హాట్ టాపిక్‌గా మారింది?
కొద్ది రోజుల కిందట బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు, భారత్‌లో జరుగుతున్న రాజకీయ నిరసనల మధ్య సంబంధాలున్నాయంటూ, దీని వెనుక సింఘమ్ స్కెచ్ వేశారని బాంబ్ పేల్చారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంశాలను కూడా వీటికి కలిపేశారు. అంతే దేశవ్యాప్తంగా ఎవరీ సింఘమ్ అనే చర్చ మొదలైంది.
ఇప్పుడు మెయిన్ పాయింట్ దగ్గరికి వద్దాం.
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్‌గా కనెక్ట్ అయిపోయింది. ఒక దేశంలో తయారైన కంటెంట్ మరో దేశంలో వైరల్ అవుతోంది. విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలపై ప్రభావం చూపే ప్రయత్నాలు కూడా జరగొచ్చు.
అందుకే విదేశీ నిధుల విషయంలో ట్రాన్స్ పరెన్సీ ఉండాలి. ఏ సంస్థకు ఎంత డబ్బు వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఆ డబ్బును ఎలా ఖర్చు చేశారు? చట్టాలను ఉల్లంఘించారా? ఇలాంటి ప్రశ్నలకు దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సమాధానాలు చెప్పాలి.
అదే సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ విదేశీ కుట్రలో భాగస్వామిగా చూడలేం. నిరసన తెలిపే ప్రతి యువకుడూ ఎవరో చెప్పినట్టు నడుస్తున్నాడని అనుకోలేం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో, విదేశీ ప్రభావం ఉంటే దాన్ని ఆధారాలతో బయటపెట్టడం కూడా అంతే ముఖ్యం.
ఈ ఎపిసోడ్ లో చివరిగా మూడు ప్రశ్నలు.
ఒకటి. నెవిల్ రాయ్ సింఘమ్‌కు సంబంధించిన నిధుల వ్యవస్థల్లో నిజంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయా? సెకండ్.. భారత్‌లో రాజకీయ నిరసనలను విదేశీ సంస్థలు ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపణలకు నిర్ధారిత ఆధారాలున్నాయా?
మూడు... ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏవేవి ఆధారాలతో నిరూపితమయ్యాయి? ఏవి ఇంకా ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి?
ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే అసలు విషయం అర్థమవుతుంది.
ఎందుకంటే దేశ భద్రత అనేది రాజకీయాలకు అతీతమైన అంశం. అదే సమయంలో ఆరోపణల ఆధారంగా ఎవరినీ దోషిగా ముద్ర వేయడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
నెవిల్ రాయ్ సింఘమ్ వ్యవహారంలో అసలు నిజం ఏంటి? విదేశీ నిధుల వెనుక ఉన్నది సామాజిక కార్యకలాపాలా? రాజకీయ ప్రభావం చూపే ప్రయత్నమా? లేక ఇంకా నిరూపించాల్సిన ఆరోపణలా? సమాధానం -నినాదాలు, ఆరోపణలు, విమర్శల్లో కాదు, ఆధారాల్లో ఉండాలి. అప్పుడే ఈ సింఘమ్ ఎపిసోడ్ కు మరింత క్లారిటీ వస్తుంది.
ఇదీ ఇవాళ్టి సీఈఓ డెస్క్
మరో అంశంతో మళ్లీ కలుద్దాం..