పాతికేళ్లుగా అధికార రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నరేంద్ర మోదీకి.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రూపంలో మరో కీలక పరీక్ష ఎదురవుతోందా..?
ఒకప్పుడు బీజేపీకి తిరుగులేని కోటగా కనిపించిన యూపీలో.. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారా..? రాహుల్ గాంధీతో అఖిలేష్ దోస్తీ.. మోదీ, యోగీ ద్వయానికి రాజకీయంగా కొత్త సవాళ్లు విసురుతోందా..? దేశవ్యాప్తంగా సర్ వివాదంపై ప్రతిపక్షాల పోరాటం.. యూపీలో అధికార మార్పునకు దారితీస్తుందా..? అన్నింటికీ మించి జెన్ జీ ఓటర్లు ఈసారి ఎవరివైపు నిలబడబోతున్నారు..? ఇప్పుడివే దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్నలు..! అసలు యూపీ అసెంబ్లీ ఎన్నికల కథేంటో చూద్దామా..? ఐతే ఇన్ డెప్త్ ఎనాలిసీస్ లోకి వెళ్దాం...
ఉత్తరప్రదేశ్..!
దేశ రాజకీయాలకు దిక్సూచిగా చెప్పుకునే రాష్ట్రమిది. 403 అసెంబ్లీ స్థానాలు.. 80 లోక్‌సభ స్థానాలు..! ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలనుకునే ఏ పార్టీకైనా యూపీ అత్యంత కీలకం. యూపీలో ఎవరు గెలిస్తే కేంద్రంలో వాళ్లదే అధికారం అనే రాజకీయ నానుడి కూడా ఉంది. అయితే అది ప్రతిసారీ నిజమవుతుందని కాదు కానీ.. యూపీలో వచ్చే ఫలితం దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అందుకే 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి.
అసలు ఈసారి యూపీలో ఏం జరగబోతోంది..? 2017, 2022 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బీజేపీ.. మూడోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటుందా..? లేక అఖిలేష్ యాదవ్ పదేళ్ల తర్వాత సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా..? ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ముఖ్యంగా సర్ వివాదం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక రాజకీయ అస్త్రంగా మారుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతాయనే ఆందోళనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం సవరణ అవసరమనే వాదన వినిపిస్తోంది. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఒకటుంది. ఈ వివాదాన్ని ప్రతిపక్షాలు ప్రజా ఉద్యమంగా మార్చగలవా..? అదే జరిగితే యూపీ ఎన్నికలపై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది..?
ఎందుకంటే.. విపక్షాల నిరసనలతో ఢిల్లీ కొద్ది రోజులుగా భగ్గుమంటోంది. దీనికి సీజేపీ ఉద్యమం కూడా తోడైంది. ఇండి కూటమి అయినా, కాక్రోచ్ లైనా ఎవరు రోడ్డెక్కుతున్నా.. కేంద్రానికి వ్యతిరేకంగానే. అందుకే ఇది బీజేపీకి డేంజర్ బెల్. ఇదే ఇప్పుడు బీజేపీ ముందున్న రాజకీయ సవాళ్లలో కీలకమైనది.
ఓటు హక్కు అనే అంశం కామన్ మ్యాన్ కి సంబంధించినది. ఓటు విషయంలో అన్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో ఏర్పడితే అది అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇందులో ఎలాంటి డౌటూ లేదు. ఈ విషయంలో డిఫెండ్ చేసుకునేందుకు బీజేపీ ఎందుకో వెనుకబడిందన్నది మాత్రం అర్థమవుతోంది. ఓటు అంశం కాబట్టి.. ఏం మాట్లాడినా జనాల్లో వ్యతిరేకత వస్తుందనేది ఆ పార్టీ టెన్షన్ కావచ్చు. ఇదే టైమ్ లో ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ ఇష్యూ విపక్షాలకు బాగా కలిసొచ్చింది.
ఇక్కడ కాంగ్రెస్ వ్యూహం కూడా కీలకమే. రాహుల్ గాంధీ రాజకీయ పోరాటాన్ని కేవలం పార్లమెంట్‌కే పరిమితం చేయకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే ఆలోచన కనిపిస్తోంది. ప్రతి రోజూ గాంధీ పరివార్ రోడ్డెక్కుతుండడం.. ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.
ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్‌తో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరి రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడు ఒకే లక్ష్యం చుట్టూ తిరుగుతున్నాయి. అదే బీజేపీని ఓడించడం..! ముందుగా యూపీ కోటను బద్ధలు కొట్టడం.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన లెక్క ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ మరో ఆరు స్థానాలు సాధించింది. అంటే ఇండియా కూటమికి మొత్తం 43 స్థానాలు దక్కాయి. బీజేపీ మాత్రం 33 స్థానాలకు పరిమితమైంది. ఇది సాధారణమైన ఫలితం కాదు. అంతకుముందు యూపీలో బలమైన ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీకి ప్రతిపక్ష కూటమి గట్టి పోటీ ఇవ్వగలదని నిరూపించిన ఎన్నిక అది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఇంకా మారాయనేది కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్ జీ ఉద్యమం హాట్ హాట్ గా నడుస్తోంది. అది కలిసొచ్చి యూత్ మొత్తం ఇండి కూటమికి జై కొడితే.. అఖిలేష్ కి అనూహ్యమైన విజయం దక్కొచ్చు.
ఈ ఫార్ములాను 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తే..? అఖిలేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమేనా..? ఇదే ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ.
ఎవరు అవునన్నా.. కాదన్నా.. అఖిలేష్‌కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదే కాంగ్రెస్‌తో పొత్తు. సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న సామాజిక పునాదికి కాంగ్రెస్ మద్దతు తోడైతే కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురుకావచ్చు. కానీ ఇక్కడే సీట్ షేరింగ్ అత్యంత కీలకం. కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కోరుతుంది..? సమాజ్‌వాదీ పార్టీ ఎన్ని స్థానాలు వదులుకుంటుంది..? బలమైన అభ్యర్థులు ఎవరికి ఉన్నారు..? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకకపోతే కూటమి ఐక్యత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
అంటే రాహుల్, అఖిలేష్ చేతులు కలిపితే సరిపోదు..! వారి పార్టీల కార్యకర్తలు కూడా చేతులు కలపాలి. నాయకుల మధ్య స్నేహం ఓట్ల బదిలీగా మారాలి. సీట్ల పంపకంలో చిన్న పొరపాటు జరిగినా బీజేపీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే యూపీలో ఇండియా కూటమి గెలుపోటములను నిర్ణయించే అంశాల్లో సీట్ల సర్దుబాటు కూడా ఒకటిగా మారబోతోంది.
ఇక మరో కీలకమైన అంశం జెన్ జీ..! ఈసారి యువ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగాలు ఎక్కడ..? పోటీ పరీక్షల్లో పారదర్శకత ఎంత..? చదువు పూర్తయిన తర్వాత భవిష్యత్తుకు భరోసా ఏది..? ఇవి యువత ముందున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు రాజకీయ పార్టీలు ఇచ్చే సమాధానాలే యువ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు.
అఖిలేష్ యాదవ్ కూడా యువత సమస్యలను తన రాజకీయ ప్రచారంలో ప్రధాన అంశాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలు, సామాజిక న్యాయం వంటి అంశాలతో యువ ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు.
సీఎంగా యోగీ ఆధిత్యనాథ్ కి మంచి పేరే ఉన్నా.. అదే స్థాయిలో సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఈసారి బీజేపీ ముందున్న అసలు సవాల్ ఏంటంటే.. గత విజయాలను మరోసారి పునరావృతం చేయడం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని ఎంతవరకు మార్చుకుంది..? వెనుకబడిన వర్గాలు, దళితులు, యువతలో మద్దతును ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతుంది..? ఇదే యోగీ ప్రభుత్వానికి కీలక పరీక్ష.
2027 యూపీ ఎన్నికలు.. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో రాజకీయ గాలి ఎటువైపు వీస్తోందనే సంకేతాన్ని ఇస్తాయి. యూపీలో బీజేపీ మరోసారి గెలిస్తే మోదీ–యోగీ నాయకత్వానికి అది పెద్ద రాజకీయ బలం. అదే అఖిలేష్ గెలిస్తే.. ఇండియా కూటమికి జాతీయ స్థాయిలో కొత్త ఉత్సాహం లభిస్తుంది. కాంగ్రెస్ కూడా తన మిత్రపక్షాలతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండో లెక్కకే అనుకూల వాతావరణం ఉందట. అఖిలేష్ వైపే యూపీ మొగ్గుతోందనే విషయం చాలా సర్వేల్లో బయటపడుతోంది. అందుకే బీజేపీ టెన్షన్ పడుతోందట.
మొత్తానికి యూపీ ఎన్నికలు ఈసారి రెండు పార్టీల మధ్య అధికార పోరాటం మాత్రమే కాదు..! ఒకవైపు పదేళ్ల పాలనను కొనసాగించాలని చూస్తున్న బీజేపీ.. మరోవైపు పదేళ్ల తర్వాత అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న అఖిలేష్ యాదవ్..! మధ్యలో కాంగ్రెస్ వ్యూహాలు.. సర్ వివాదం.. యువత ఆకాంక్షలు.. సామాజిక సమీకరణాలు..!
యూపీ ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడో ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం. 2027లో లక్నో పీఠం కోసం జరిగే పోరాటం.. 2029లో ఢిల్లీ పీఠం కోసం జరిగే రాజకీయ యుద్ధానికి ఒక కీలక సంకేతంగా మారబోతోందన్నది వాస్తవం.